Saturday, 9 August 2025

ఆ ఇద్దరికీ ఉరి శిక్ష విధించాలి.. బండి సంజయ్ సంచలన డిమాండ్

 ఆ ఇద్దరికీ ఉరి శిక్ష విధించాలి.. బండి సంజయ్ సంచలన డిమాండ్ 



              కేసీఆర్‌ తో సీఎం రేవంత్‌ రెడ్డి కుమ్మక్కయ్యారని.. అందుకే ఫోన్‌ ట్యాపింగ్‌ కేసులో కేసీఆర్‌ కుటుంబానికి సీఎం క్లీన్‌ చిట్ ఇచ్చారని కేంద్ర మంత్రి బండి సంజయ్‌ విమర్శించారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో అధికారులుగా ఉన్న రాధాకిషన్ రావు, ప్రభాకర్ రావు ఫోన్ ట్యాపింగ్‌ కు పాల్పడ్డారని.. అందుకు వారికి ఉరిశిక్ష విధించాలని బండి సంజయ్ సంచలన డిమాండ్ చేశారు. ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఈ సిట్‌ కు అధికారాలు లేవని, విచారణతో కాలయాపన తప్ప ఇంకేం జరగదని అన్నారు. గతంలో బీఆర్ఎస్ దోచుకుందని, ఇప్పుడు కాంగ్రెస్‌ దోచుకుంటోందని దుయ్యబట్టారు. ఈ మేరకు ఫోన్‌ ట్యాపింగ్‌ కేసు విచారణను సీబీఐకి అప్పగించాలని డిమాండ్ చేశారు. హైదరాబాద్‌ లోని దిల్‌ కుష్ భవన్ లో సిట్‌ విచారణకు హాజరైన అనంతరం మీడియాతో ఆయన మాట్లాడారు. ఈ కేసులో ప్రస్తుతం రేవంత్ రెడ్డి ప్రభుత్వం నిందితులకు కాపాడే ప్రయత్నాలు చేస్తోందని బండి సంజయ్ మండిపడ్డారు. కేసును ఇంకా సాగిదీస్తున్నారని అన్నారు. కమిషన్లు, కమిటీలు వేసి.. నివేదికలు వచ్చిన తర్వాత చర్యలు తీసుకోకుండా సైలెంట్ అయిపోతారని అన్నారు. కేసీఆర్‌ ప్రభుత్వంలో అత్యధికంగా తన ఫోన్‌ కాల్స్‌నే ట్యాప్‌ చేశారని.. తన కుటుంబ సభ్యులు, పని మనుషుల ఫోన్లు కూడా ట్యాప్‌ చేశారని బండి సంజయ్ ఆరోపించారు. ఆఖరికి భార్యాభర్తల ఫోన్లూ ట్యాప్‌ చేసి విన్నారని.. నా వద్ద ఉన్న ఆధారాలు, సమాచారం అధికారులకు ఇచ్చానన్నారు.

  మావోయిస్టులకు సంబంధించిన ఫోన్లు ట్యాప్‌ చేయాలి.. కానీ, ఆ జాబితాలో తమ పేర్లు పెట్టి ట్యాపింగ్‌ కు పాల్పడ్డారని దుయ్యబట్టారు. రేవంత్‌ రెడ్డి, హరీశ్‌ రావు ఫోన్లు కూడా ట్యాప్‌ చేశారని.. ఫోన్‌ ట్యాపింగ్‌ వ్యవహారంలో మొదటిసారి వాంగ్మూలం ఇచ్చింది తానేన్నారు. కేసీఆర్‌ ప్రభుత్వం విచ్చలవిడిగా ఫోన్లు ట్యాప్‌ చేసిందని.. కేసీఆర్‌ కుమార్తె, అల్లుడి ఫోన్లు కూడా ట్యాప్‌ చేశారన్నారు. ఇక TGPSC పేపర్ లీకేజీ సమయంలో ఆ కేసుపై విచారణ జరుపుతున్న జడ్జి ఫోన్‌ ను కూడా ట్యాప్ చేశారని బండి సంజయ్ ఆరోపణలు చేశారు. ప్రభాకర్‌రావు, రాధా కిషన్‌రావు బాగోతం చెబుతుంటే తనకే సిగ్గనిపించిందని.. వారిద్దర్నీ సమాజం క్షమించదన్నారు. ఇద్దరికీ ఉరిశిక్ష వేస్తే ఒకేసారి చనిపోతారని.. క్షణక్షణం బాధపడాలన్నారు. తమ కార్యకర్తలను, ఇతర పార్టీ నాయకులను క్షోభకు గురి చేశారని ఆవేదన వ్యక్తం చేశారు బండి సంజయ్. ఇద్దరు నిందితులను కాపాడే ప్రయత్నం రేవంత్‌ రెడ్డి ప్రభుత్వం చేస్తోందన్నారు. 


             తెలుగు రాష్ట్రాల్లో ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం సంచలనంగా మారిన విషయం తెలిసిందే. గతంలో కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో భారీ ఎత్తున ఫోన్ ట్యాపింగ్ జరిగినట్లు తీవ్ర ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఈ కేసును ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ఈ మేరకు సీఎం రేవంత్ రెడ్డి గతంలో స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ (సిట్) ఏర్పాటు చేశారు. ఈ క్రమంలో ఫోన్ ట్యాపింగ్ కేసులో ఇప్పటికే పలువురిని అరెస్ట్ చేసి విచారణ జరుపుతున్నారు. సాక్షుల వాంగ్మూలాలను రికార్డ్ చేస్తున్నారు. విచారణలో భాగంగానే కేంద్రమంత్రి బండి సంజయ్‌ దిల్ ఖుష్ భవన్‌ లో సిట్ విచారణకు హాజరయ్యారు.

0 Comments:

Post a Comment

Subscribe to Post Comments [Atom]

<< Home