Friday, 4 July 2025

BJPకి మహిళా అధ్యక్షురాలు? రేసులో నిర్మలా సీతారామన్‌, పురందేశ్వరి, వానతీ శ్రీనివాసన్ ​!

 

త్వరలో బీజేపీకి మహిళా అధ్యక్షురాలు? నిర్మలా సీతారామన్‌, డి.పురందేశ్వరి, వానతీ శ్రీనివాసన్ 

2 Min Read

BJP Female President Race : బీజేపీ అధ్యక్ష పీఠాన్ని ఈసారి ఒక మహిళకు అప్పగించాలని పార్టీ అధిష్టానం భావిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. పైగా ఈ రేసులో కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్​, ఆంధ్రప్రదేశ్​కు చెందిన బీజేపీ ఎంపీ దగ్గుబాటి పురందరేశ్వరి, బీజేపీ జాతీయ మహిళా మోర్చా అధ్యక్షురాలు వానతీ శ్రీనివాసన్ ఉన్నట్లు తెలుస్తోంది.

మహిళలకు పెద్దపీట
భారతీయ జనతా పార్టీ అధ్యక్ష పదవికి ఎన్నిక నిర్వహించాలంటే, కనీసం 19 రాష్ట్రాల్లో నూతన సారథుల నియామకాలు పూర్తి కావాలి. ఇప్పటి వరకు 16 రాష్ట్రాల్లో పార్టీ అధ్యక్షులను ఖరారు చేశారు. మరికొన్ని రోజుల్లో మధ్యప్రదేశ్​ లాంటి పెద్ద రాష్ట్రాలకు కొత్త సారథులను నియమించనున్నారు. ఆ తర్వాత పార్టీ నిబంధనల ప్రకారం, పార్టీ జాతీయ అధ్యక్ష పదవికి ఎన్నిక నిర్వహిస్తారు. అయితే ఈ సారి బీజేపీ జాతీయ అధ్యక్ష పదవిని ఒక మహిళకు అప్పగించే అవకాశం ఉందని వార్తలు వస్తున్నాయి. ఈ రేసులో ప్రధానంగా నిర్మలా సీతారామన్​, పురందరేశ్వరి, వానతీ శ్రీనివాసన్ పేర్లు వినిపిస్తున్నాయి. తమ పార్టీలో స్త్రీలకు పెద్దపీట వేయాలనే ఉద్దేశంతోనే మొదటిసారిగా ఓ మహిళకు అధ్యక్ష పదవి కట్టబెట్టేందుకు అధిష్ఠానం చర్యలు తీసుకుంటున్నట్లు సంబంధిత వర్గాలు పేర్కొంటున్నాయి.

నిర్మలా సీతారామన్‌
బీజేపీ అధ్యక్ష పదవి రేసులో కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్‌ మొదటి స్థానంలో ఉన్నట్లు తెలుస్తోంది. భారతీయ జనతా పార్టీలోని అత్యంత ప్రభావవంతమైన నేతల్లో ఆమె ఒకరు. 2019లో మోదీ ప్రభుత్వ హయాంలో తొలిసారి నిర్మలమ్మ ఆర్థికశాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టి, ఇప్పటికీ అదే పదవిలో కొనసాగుతున్నారు. ఇటీవల ఆమె బీజేపీ ప్రధాన కార్యాలయంలో ప్రస్తుత జాతీయ అధ్యక్షుడు జేపీనడ్డా, పార్టీ ప్రధాన కార్యదర్శి బీఎల్ సంతోష్‌లను కలిసినట్లు తెలుస్తోంది.

Nirmala Sitharaman
నిర్మలా సీతారామన్​ 

దగ్గుబాటి పురందేశ్వరి
రాజమహేంద్రవరం ఎంపీ దగ్గుబాటి పురందేశ్వరి కూడా బీజేపీ జాతీయ అధ్యక్ష పదవి రేసులో ఉన్నారు. ఆమె బీజేపీ ఆంధ్రప్రదేశ్ యూనిట్ చీఫ్‌గా పని చేశారు. ఉగ్రవాదంతో అంటకాగుతూ భారత్‌పై విషం చిమ్ముతున్న పాక్​ కుయుక్తుల్ని అంతర్జాతీయ వేదికపై ఎండగట్టేందుకు కేంద్రం ఏర్పాటుచేసిన 7 అఖిలపక్ష బృందాల్లోని ఓ బృందానికి పురందేశ్వరి ప్రాతినిధ్యం వహించారు కూడా. ఫ్రాన్స్, యూకే, ఈయూ, ఇటలీ, డెన్మార్క్, జర్మనీ దేశాల్లో పర్యటించిన ఆమె బృందం ఉగ్రవాదంపై భారత్‌ వైఖరిని ప్రపంచ దేశాలకు స్పష్టంచేసింది.

Purandeswari
డి. పురందరేశ్వరి 

వానతీ శ్రీనివాసన్
బీజేపీ జాతీయ మహిళా మోర్చా అధ్యక్షురాలు, తమిళనాడు ఎమ్మెల్యే వానతీ శ్రీనివాసన్‌ 1993 నుంచి భారతీయ జనతా పార్టీలో కొనసాగుతున్నారు. ఆమె 2021 తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో ప్రముఖ నటుడు, మక్కల్ నీది మయ్యం (ఎంఎన్​ఎం) వ్యవస్థాపకుడు అయిన కమల్ హాసన్‌ను ఓడించి కోయంబత్తూర్ (దక్షిణ) స్థానాన్ని గెలుచుకున్నారు. 2022లో బీజేపీ కేంద్ర ఎన్నికల కమిటీ సభ్యురాలిగా ఆమె ఎన్నికయ్యారు.

vanathi srinivasan

0 Comments:

Post a Comment

Subscribe to Post Comments [Atom]

<< Home