తిరుమలలో అలా చేయడం సరికాదు- చట్టపరమైన చర్యలుంటాయ్
తిరుమలలో అలా చేయడం సరికాదు- చట్టపరమైన చర్యలుంటాయ్
ప్రఖ్యాత పుణ్యక్షేత్రం తిరుమలలో భక్తుల రద్దీ నెలకొంది. శుక్రవారం నాడు 71,721 మంది భక్తులు శ్రీవారి దర్శించుకున్నారు. వారిలో 36,011 మంది తలనీలాలు సమర్పించారు. తమ మొక్కులు చెల్లించుకున్నారు. ఆ ఒక్కరోజే హుండీ ద్వారా 3.42 కోట్ల రూపాయల ఆదాయం తిరుమల తిరుపతి దేవస్థానానికి అందింది. వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌లోని అన్ని కంపార్ట్‌మెంట్లు భక్తులతో నిండిపోయాయి. శిలాతోరణం వరకు క్యూ లైన్ ఏర్పడింది. టోకెన్ లేని సర్వదర్శనం భక్తులకు స్వామివారి దర్శనానికి 18 నుండి 20 గంటల సమయం పట్టింది. కంపార్ట్‌మెంట్లు, క్యూ లైన్లల్లో ఉన్న వారికి టీటీడీ సిబ్బంది, శ్రీవారి సేవకులు అల్పాహారం, పాలు, మంచినీరు పంపిణీ చేశారు.
వేసవి సెలవుల కారణంగా వారం రోజులుగా తిరుమలలో భక్తుల తాకిడి భారీగా పెరిగింది. ఈ క్రమంలో అన్ని విభాగాల అధికారులు సమన్వయంతో భక్తులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా టీటీడీ చర్యలు తీసుకుంటోంది. వైకుంఠం క్యూకాంప్లెక్స్ కంపార్టుమెంట్లు, నారాయణగిరి షెడ్లు, బయట క్యూలైన్లలో వేచి ఉన్న భక్తుల కోసం టీటీడీ నిరంతరాయంగా అన్నప్రసాదం, మంచినీటిని అందజేస్తోంది. ఈ నేపథ్యంలో- టీటీడీ అదనపు కార్యనిర్వహణాధికారి సీహెచ్ వెంకయ్య చౌదరి.. తనిఖీలు నిర్వహించారు. శిలాతోరణం వద్ద క్యూలైన్లను పరిశీలించారు. భక్తులకు పంపిణీ చేస్తున్న అన్న ప్రసాదాలు, ఇతర సౌకర్యాల గురించి అభిప్రాయాలను తెలుసుకున్నారు. టీటీడీ సిబ్బంది అందిస్తోన్న సౌకర్యాలపై భక్తులు సంతృప్తి వ్యక్తం చేశారు. అనంతరం విలేకరులతో మాట్లాడారు. క్యూలైన్ లల్లో భక్తులకు అన్న ప్రసాదాలు అందట్లేదని నినాదాలు చేశాడని, ఆ విషయం తమ దృష్టికి వచ్చిందని అన్నారు. ఆయనను వెంటనే సంప్రదించి ఆరా తీయగా తనకు ఆరోగ్యం సరిగ్గా లేకపోవడం, రద్దీ గురించి అవగాహన లేకపోవడం, దర్శన సమయం ఆలస్యమౌతోందనే కారణంతో తాను అసహనానికి గురైనట్లు ఒప్పుకున్నారని చెప్పారు. ఆ తరువాత క్షమాపణలు చెప్పాడని అన్నారు.
టీటీడీ అధికారులు ఎప్పటికప్పుడు క్యూలైన్లను పర్యవేక్షిస్తూ భక్తులకు అందిస్తోన్న సదుపాయాలను పర్యవేక్షిస్తున్నారని వెంకయ్య చౌదరి చెప్పారు. వేసవి సెలవుల నేపథ్యంలో ప్రతి రోజూ లక్షకు పైగా భక్తులు స్వామివారి దర్శనం కోసం వస్తున్నారని, వారాంతాల్లో ఈ సంఖ్య 1.20 లక్షలు దాటుతోందని చెప్పారు. వీఐపీ బ్రేక్, శ్రీవాణి దర్శనాలను తగ్గించి సాధారణ భక్తులకే దర్శనాల్లో పెద్దపీట వేస్తున్నామని అదనపు ఈఓ వివరించారు. ప్రతిరోజూ 60 శాతానికి పైగా సర్వ దర్శనానికి విచ్చేసే భక్తులే స్వామివారిని దర్శించుకుంటున్నారని పేర్కొన్నారు. సాధారణ రోజుల కంటే 10,000 మంది భక్తులకు అదనంగా దర్శనం కల్పించడానికి టీటీడీ సిబ్బంది కష్టపడుతున్నారని అన్నారు. క్యూలైన్లలోని భక్తులకు శ్రీవారి సేవకుల ద్వారా నిరంతరాయంగా అన్న ప్రసాదాలు, టీ, కాఫీ, పాలు, మజ్జిగ, స్నాక్స్ పంపిణీ చేస్తున్నామని, ఆరోగ్య విభాగం ద్వారా ఎప్పటికప్పుడు చెత్తను తొలగిస్తూ భక్తులకు ఎలాంటి అసౌకర్యం తలెత్తకుండా పారిశుద్ధ్యంపై ప్రత్యేక దృష్టి పెట్టామని తెలిపారు.
ఇక నుంచి..!!" టీటీడీ సిబ్బంది కృషిని పట్టించుకోకుండా భక్తుల మనోభావాలు దెబ్బతినేలా కొందరు ఇలా ప్రవర్తించడం సరికాదని వెంకయ్య చౌదరి వ్యాఖ్యానించారు. కొందరు అనధికారిక వ్యక్తులు దర్శన క్యూలైన్లలో భక్తులను రెచ్చగొడుతూ వీడియోలు తీస్తున్నారని, అలాంటివారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. విపరీత రద్దీ నేపథ్యంలో భక్తులు టీటీడీ అందిస్తున్న సౌకర్యాలను వినియోగించుకుని సంయమనం పాటిస్తూ స్వామివారిని దర్శించుకోవాల్సిందిగా విజ్ఞప్తి చేశారు. శ్రీవారి దర్శనార్థం తిరుమలకు విచ్చేసే భక్తుల కోసం టీటీడీ సిబ్బంది అహర్నిశలు కృషి చేస్తున్నా భక్తుల మనోభావాలు దెబ్బతినేలా మాట్లాడటం సరికాదని చెప్పారు.


0 Comments:
Post a Comment
Subscribe to Post Comments [Atom]
<< Home