Saturday, 25 December 2021

ఫ్రంట్ లైన్ వర్కర్లు, 60 ఏళ్లకు పైబడిన వారికి బూస్టర్ డోస్, 15-18 ఏళ్ల వారికి వ్యాక్సిన్: మోడీ

        


ఒమిక్రాన్ కేసుల నేపథ్యంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కీలక ప్రకటన చేశారు. బూస్టర్ డోసు గురించి చెప్పారు. కాసేపటి క్రితం జాతిని ఉద్దేశించి ప్రసంగం చేశారు. కరోనాపై అవిశ్రాంతంగా పోరాడుతున్న ఫ్రంట్ లైన్ వర్కర్లకు బూస్టర్ డోసు వ్యాక్సిన్ ఇస్తామని తెలిపారు. జనవరి 10వ తేదీ నుంచి బూస్టర్ డోసు ఇస్తామని ఆయన వివరించారు. అలాగే 60 ఏళ్లు దాటిన వృద్దులకు కూడా బూస్టర్ డోసు ఇస్తామని వివరించారు. 15 ఏళ్ల నుంచి 18 ఏళ్ల వరకు గల పిల్లలకు కూడా టీకా ఇస్తామని మోడీ వివరించారు. వారికి డీఎన్ఏ వ్యాక్సిన్ ఇస్తామని చెప్పారు. దీనికి సంబంధించి ఇప్పటికే శాస్త్రవేత్తలతో సంప్రదింపులు జరిపామని చెప్పారు. ఇప్పటివరకు 141 కోట్ల డోసులను దేశవ్యాప్తంగా ప్రజలకు అందజేశామని వివరించారు. దేశంలో ఇప్పటివరకు 90 శాతం కన్నా ఎక్కువ మందికి ఫస్ట్ డోస్ ఇచ్చామని తెలిపారు.l ఒమిక్రాన్ కట్టడికి భారత్ సిద్దంగా ఉందని మోడీ వివరించారు. కరోనా వైరస్ ఇప్పటికీ ఉందని.. తగిన జాగ్రత్తలు తీసుకోవడమే మార్గం అని చెప్పారు. ఇవాళ క్రిస్మస్, వాజ్ పేయి జన్మదినం అని చెప్పారు. ఆ సందర్భంగా బూస్టర్ డోసు, ఇతర అంశాల గురించి ప్రకటన చేశానని వివరించారు. ఆందోళన వద్దు.. అప్రమత్తతే ముఖ్యం.. ఒమిక్రాన్‌పై ప్రధాని మోడీ ఒమిక్రాన్ బెంబేలెత్తిస్తోన్న వేళ.. జాతిని ఉద్దేశించి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మీడియాతో మాట్లాడారు. దేశంలోని ప్రజలు.. పాత ఏడాదికి వీడ్కోలు పలికి.. న్యూ ఇయర్‌కు వెల్ కం చెప్పేందుకు ఉత్సాహంతో ఉన్నారని చెప్పారు. అయితే గుంపులు గుంపులుగా ఉండటంతో.. ప్రమాదం అని.. ఒమిక్రాన్ కేసులు పెరుగుతున్న వేళ అప్రమత్తతే శ్రీరామ రక్ష అని వివరించారు. ప్రజలు అంతా జాగ్రత్తగా ఉండాలని సూచించారు. తప్పనిసరిగా మాస్క్ దరించాలని.. చేతులను శుభ్రంగా కడుక్కొవాలని కోరారు. ఇటు ఇప్పటికే పలు రాష్ట్రాలు రాత్రి కర్ఫ్యూ విధిస్తున్నాయి. ఒమిక్రాన్ వేరియంట్ వ్యాప్తి నిర్మూలన కోసం తెలంగాణ ప్రభుత్వం కూడా ముందు జాగ్రత్త చర్యలు చేపట్టింది. హైకోర్టు ఆదేశాల మేరకు నూతన సంవత్సర వేడుకలపై ఆంక్షలు విధించింది. జనవరి 2వ తేదీ వరకు రాష్ట్రంలో బహిరంగ సభలు, ర్యాలీలు నిషేధించింది. కోవిడ్ జాగ్రత్తలు పాటిస్తూ నిర్వహించుకునే సమావేశాలకు ప్రభుత్వం అనుమతి ఇవ్వనుంది.